సృష్టి ఫెర్టిలిటీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసుతో వైసీపీ లింకులు బయటపడుతున్నాయి. సృష్టి హాస్పిటల్ డాక్టర్ నమ్రత టీమ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోదరుడు రవి ఉన్నట్లుగా తేలింది. KGH ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా ఉన్న డాక్టర్ వాసుపల్లి రవిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సృష్టి హాస్పిటల్ దందా అంతా వైజాగ్ కేంద్రంగానే జరిగిందని, సరోగసి పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి పసి బిడ్డలను అమ్మకానికి పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ అత్యంత అమానవీయంగా డబ్బుల కోసం సరోగసి అని చెప్పి.. పిల్లలను అమ్మిన డాక్టర్ నమ్రత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆ ముఠాలో ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పిల్లల్ని కొనుగోలు చేసే ముఠాలు.. అమ్మే ముఠాలతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
సరోగసీ ముసుగులో డా. నమ్రత ముఠా రెండేళ్లలో 80 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ కేంద్రం దాదాపు 15 ఏళ్లుగా నడుస్తున్నందున అప్పటి నుంచి వందల మంది శిశువుల్ని విక్రయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల ద్వారా బాధితుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన సంతోషి ద్వారా 18 మంది పిల్లల్ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. మరికొందరి ఏజెంట్ల నుంచి కూపీ లాగుతున్నారు. ఇంకోవైపు డాక్టర్ నమ్రతకు సహకరించిన వైద్యుల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు వైద్యుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది.