వై ఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇటీవల జరిగిన ఎన్నికల హింస, పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అల్లర్లు, దాడులపై నమోదైన పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, పోలీసులు తీసుకున్న చర్యలను నిలిపివేయాలని, కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, కేసుల దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున, అరెస్టులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని, న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
దీంతో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఆయన సోదరుడికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి.