ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం కర్నూలు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి శుభవార్త అందింది. ఎమ్మిగనూరు-కర్నూలు రైల్వే లైన్ (కర్నూలు- ఎమ్మిగనూరు- తోర్నగల్ రైల్వేలైన్) కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. డీపీఆర్‌కు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.
ఎమ్మిగనూరు-కర్నూలు జాతీయ రహదారికి రైల్వే లైన్ అనుసంధానం కానుంది అన్నారు. అలాగే కర్నూలు రహదారి మరమ్మతుల కోసం రూ.5.60 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలో మొదలవుతాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని.. ఇందులో భాగంగానే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతి గ్రామానికి హెల్త్ క్లినిక్‌ను మంజూరు చేస్తామని చెప్పారు.
సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని.. కానీ YSRCP నాయకులు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కర్నూలు- ఎమ్మిగనూరు- తోర్నగల్ రైల్వేలైన్‌పై నెల క్రితం.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
కర్నూలు నుండి ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం మీదుగా తోర్నగల్ వరకు రైలు మార్గం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కర్నూలు నుంచి కర్ణాటకలోని తోర్నగల్ వరకు రైల్వే లైన్ నిర్మించాలని వారు కోరారు. ఈ రైలు మార్గం కర్నూలు ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు.
కర్నూలు నుంచి మంత్రాలయం రోడ్ స్టేషన్ వరకు కొత్త రైలు మార్గం వేయాలనే ఆలోచన చేయగా.. ఆ తర్వాత లాభదాయకం కాదని రైల్వే శాఖ పక్కన పెట్టింది.
అయితే కర్నూలు నుంచి ఎమ్మిగనూరు, ఆదోని మీదుగా కర్ణాటకలోని తోర్నగల్ వరకు కొత్త రైలు మార్గం వేస్తే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. కర్నూలు నుంచి మంత్రాలయం రోడ్ స్టేషన్ వరకు కొత్త లైన్ వేయాలని గతంలో ప్లాన్ చేశారు.. సర్వే చేసిన తర్వాత అడుగులు ముందుకు పడలేదు. రైల్వే అధికారులు ఆ ఆలోచనను విరమించుకున్నారు. తోర్నగల్‌లో జిందాల్ ఉక్కు కర్మాగారం ఉంది. పశ్చిమ ప్రాంతం నుంచి తోర్నగల్ వెళ్లాలంటే గుంతకల్లు, బళ్లారి మీదుగా వెళ్లాల్సి వస్తోంది.
కర్నూలు నుండి నేరుగా రైలు మార్గం ఉంటే ప్రయాణం సులువు అవుతుంది అంటున్నారు. బళ్లారి, తోర్నగల్ ప్రాంతాల్లో గనులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రైల్వే లైన్ వల్ల ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయంటున్నారు. ఈ రైలు మార్గం పూర్తయితే తోర్నగల్లు-గుంతకల్లు మార్గంలో రైళ్ల రద్దీ తగ్గుతుంది అంటున్నారు. కర్ణాటక నుంచి మంత్రాలయం వచ్చే భక్తులకు కూడా ఈ మార్గం చాలా అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.