దేశంలో యూరియా కొరత కేవలం సరఫరా సమస్యగా ప్రారంభమై, తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది. ఇది వ్యవసాయ, రాజకీయ, పరిపాలనా వ్యవస్థల మధ్య ఉన్న సంక్లిష్టతను బయటపెట్టింది. 2024 ఖరీఫ్ సీజన్‌లో అనుకూల వర్షాలతో సాగు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో కొరత ఏర్పడింది.
పరిమితంగా యూరియాను పంపిణీ చేయడం రైతుల ఆందోళనను మరింత పెంచింది. మొక్కల పెరుగుదలకు నత్రజని అత్యంత అవసరం. నత్రజని లోపం ఏర్పడినప్పుడు మొక్కల పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారి, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
యూరియా తనలో 46% నత్రజనిని కలిగి ఉండటం వల్ల, ఈ అవసరాన్ని తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా తీర్చగలదు. భారతదేశంలో హరిత విప్లవం విజయవంతం కావడానికి, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి యూరియా వాడకం ఒక ముఖ్య కారణం. ప్రభుత్వాలు యూరియాపై భారీ సబ్సిడీలు అందిస్తున్నాయి.
ఇందువల్ల ఇతర ఎరువులతో పోలిస్తే ఇది రైతులకు చాలా చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తు, ఈ ధరల వ్యత్యాసం రైతులను అవసరానికి మించి యూరియాను విచక్షణారహితంగా వాడేలా ప్రోత్సహించింది. ఫలితంగా భూసారం దెబ్బతిని, నేల ఆరోగ్యం క్షీణించింది.
ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన సబ్సిడీనే పరోక్షంగా వ్యవసాయానికి చేటు చేస్తోంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీశాయి. రామగుండం వంటి కీలకమైన కర్మాగారాల్లో ఉత్పత్తి నిలిచిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది.
అనుకూల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియాకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మి రైతులను దోపిడీ చేశారు. యూరియా కొరత దేశంలోని అనేక రాష్ట్రాలను ప్రభావితం చేసింది, కానీ ప్రతిచోటా దాని ప్రభావం, కారణాలు విభిన్నంగా ఉన్నాయి.