అందమైన రంగును వేస్తున్న ఆ చేతితో పట్టాల్సింది కుంచె కాదని అతని మొహంలో ఏ కోశానా బాధ కనబడడం లేదు!
మరో చేతితో రంగు ఒలికిపోకుండా డబ్బాను నిలువరిస్తూ.. చూపును తీక్షణంగా లక్ష్యం వైపు గురిపెట్టాడు.
ఏడు సంవత్సరాలుగా కోనసీమ, గన్నవరం, నాగల్లంక శివారు కాట్రగడ్డకు చెందిన చాట్ల రత్నరాజు తన కుటుంబ పోషణ కోసం, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం, దానిని అలవాటుగా.. బ్రతుకుతెరువుగా చేసుకొన్నాడు. బి.ఈడీ పూర్తిచేసి పాఠాలు చెప్పాలని కలలుగన్నాడు. రెండుసార్లు డీఎస్సీ రాసి విఫలమైనా, అతడు ఆగిపోలేదు.
డీఎస్సీ నియామకాల ప్రకటన ఐదేళ్లపాటు వెలువడలేదని నిస్పృహలతో.. గురువు అవ్వాలనే లక్ష్యంను మార్చలేదు. కరోనా.. ఇసుక కష్టాల్లో కుంచె పనుల బదులు కూలీ పనులు వచ్చినా విడిచిపెట్టలేదు. ఆ కష్టం కసిని పెంచింది.
ప్రతి రోజు పని తర్వాత అలసిపోయి ఇంటికి చేరిన రత్నరాజు, తనలో ఇంకా సజీవంగా ఉన్న ఉపాధ్యాయుడి కలను మరచిపోలేదు. ఆ అలసటను పక్కనపెట్టి, తన పుస్తకాలను తెరిచి చదువుకున్నాడు. ఆ పేజీల్లో అతడు కేవలం పాఠాలు చూడలేదు, తన భవిష్యత్తును, తన పిల్లల బంగారు భవిష్యత్తును చూసుకున్నాడు.
ఈసారి, మెగా డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించి, స్కూల్ అసిస్టెంట్ (సోషల్) టీచర్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఈ విజయం వెనుక ఉన్నది కేవలం ఒక పరీక్షలో గెలుపు కాదు. అది, చీకట్లో దీపంలా వెలిగిన ఆశ, నిరాశలోనూ సడలని ధైర్యం. ఆ చేతులు పట్టిన కుంచెతో అతను గోడలకు రంగులు అద్దాడు, ఇప్పుడు అదే చేతులతో విద్యార్థులను తన బిడ్డల్లా భావించి, తీర్చిదిద్దనున్నాడు.
తన జీవితానికి ఒక సరికొత్త రంగును అద్దిన రత్నరాజు కథ, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శం. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, మనలో కలను బ్రతికించుకుంటే, ఒక రోజు అది తప్పకుండా నిజమవుతుంది అని చాటిచెప్పే గొప్ప సందేశం ఉంది. ఆకలితో, అలసటతో ఉన్నా, తన ఆశయ సాధన కోసం పోరాడిన రత్నరాజు, ఎందరికో యువకులకు స్ఫూర్తి!