ఏపీ లిక్కర్ స్కామ్‌లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది. జగన్‌కు ఆ నగదు ఎలా చేరిందనే విషయాన్ని సిట్ బయటపెట్టింది. జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఆయన సోదరుడు వై.ఎస్.అనిల్ రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు) జగన్‌కు ఈ సొమ్ము చేరవేసేవారని తేలింది. ఇందుకు సంబంధించి సిట్‌కు కీలక ఆధారాలు దొరికాయి.
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ప్రతినెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప (A-33), ఎంపీ మిథున్‌రెడ్డి (A-4), విజయసాయిరెడ్డి (A-5), పి.కృష్ణమోహన్‌రెడ్డి (A-32), కె.ధనుంజయరెడ్డి (A-31) ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్‌కి చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. రిమాండ్ రిపోర్టుల్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది.
కసిరెడ్డి నుంచి అనిల్‌రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరింది? ఎవరెవరి ద్వారా వెళ్లింది? అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలింది? అంతిమంగా ఎక్కడికి చేరింది? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ వ్యవహారంలో అనిల్‌రెడ్డి PA దేవరాజు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. ఈ కేసు నిందితులందరితోనూ అతను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తేల్చింది. దేవరాజుది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం. 3 రోజులుగా సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు. తనకేమీ తెలియదని, కేసుతో సంబంధం లేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. తాము సేకరించిన సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారులు ప్రశ్నించటంతో అతను నీళ్లు నమిలినట్లు సమాచారం. దేవరాజు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు.
అనిల్‌రెడ్డి జగన్‌కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు..అత్యంత సన్నిహితుడు కూడా. అనిల్ రెడ్డి చెన్నైలో నివసిస్తుంటారు. జగన్ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ప్రచారముంది. గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించేవారు. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ అనిల్‌రెడ్డి ప్రమేయంపై ఫిర్యాదులున్నాయి. జేసీకేసీ, ప్రతిమ సంస్థలను ముందుపెట్టి ఆయనే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ తరఫున పెద్దఎత్తున సర్వేలు చేయించి, అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులున్నాయి. మద్యం ముడుపుల సొమ్మే ఇలా తరలించారని సిట్ అనుమానిస్తోంది.