ముఖ్యంశాలు హోమ్

ఉద్య‌మాల నిప్పుక‌ణిక స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న‌

#GowthuLachhanna

సమాజంలో అసమానతలను తొలగించేందుకు డా. స‌ర్థార్ గౌతు ల‌చ్చ‌న్న‌ చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమ‌ని, గౌతు లచ్చన్న పదవులు కోసం కాకుండా ప్రజల కోసం పోరాడారని అందుకే ఆయనను నేటికీ ఉద్యమాల నిప్పుకణికగా గౌరవంగా స్మరించుకుంటామ‌ని రాష్ట్ర వ్య‌వసాయ,సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

డా. స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న 116 జ‌యంతిని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో అధికారికంగా విజ‌యవాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో నిర్వ‌హించిది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌జ‌రై స‌ర్థార్ గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హానికి నివాళి అర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న పేరు అజరామరం అని, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహానుభావుడు ల‌చ్చ‌న్న అని అన్నారు.

తెలుగునాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన రోజుల నుండే ఆయన జీవితానికి ఉద్యమాలే పునాది. సాదాసీదా కుటుంబంలో పుట్టినా, లక్ష్యమున్న నాయకుడిగా ఎదిగి, న్యాయం కోసం కఠినంగా నిలబడిన “సర్ధార్” అన్న బిరుదును ప్రజలే అంద‌చేశార‌ని తెలిపారు. రాజకీయాల్లో ఎప్పటికీ మాయమవని ఒక వెలుగుదీపంలా ఆయన కీర్తి నిలిచిపోయిందని, నిజాయితీ, అంకితభావం, ధైర్యం ఈ మూడు గౌతు లచ్చన్న వ్యక్తిత్వానికి ప్రతిరూపాలని అన్నారు.

ల‌చ్చ‌న్న సేవలు యావ‌త్ జాతికి స్ఫూర్తిదాయ‌కం

ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ల‌చ్చ‌న్న , యావ‌త్ జాతికి ఒక స్ఫూర్తి ప్రదాత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వం బలంగా స్థిరపడతాయి. ఆయన ఆలోచనలు, ఆయన పోరాట పటిమ కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆధునికత, గ్లోబలైజేషన్ ప్రభావంతో మారుతున్న విలువల మధ్య యువతకు దిశా నిర్దేశం కావలసిన సమయం ఇది. అలాంటి సందర్భంలో గౌతు ల‌చ్చ‌న్న జీవితం ఒక మార్గదర్శక దీపం. ఆయన కృషి ద్వారా సమాజం కోసం త్యాగం అంటే ఏమిటో, నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

సమాజంలో శాశ్వత మార్పు రావాలంటే త్యాగం, పట్టుదల, నిజాయితీతో కూడిన నాయకత్వం అవసరం. అలాంటి అసమాన్య నేతలలో ఒకరు సర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న. ఆయన జీవితమంతా పేదల కోసం, కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం అంకితమైంది. సాధారణ కుటుంబం నుండి వచ్చినా, సమాజంలో న్యాయం నెలకొల్పడమే తన కర్తవ్యమని భావించి, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యవంతుడు ఆయన.

గౌతు ల‌చ్చ‌న్న జీవితం ఒక ఉద్యమ గాథ. సామాన్య ప్రజల కోసం, బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని స్వభావం ఆయనకు ఉన్నది. రాజకీయాలు ఆయనకు అధికారం కోసం మార్గం కాదు, సేవ కోసం వేదిక. సమాజంలో సమానత్వం నెలకొల్పడమే ఆయన ప్రధాన ఆశయం అని అన్నారు.

రైతు హక్కుల కోసం నిరంత‌ర పోరాటం

అదే విధంగా, వ్యవసాయదారుల పట్ల ఆయనకున్న అనుబంధం అంతులేనిది. రైతు హక్కుల కోసం న్యాయస్థానాల వరకు వెళ్లి పోరాడిన వ్యక్తి ఆయనే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రైతే బలపడాలని ఆయన ఎప్పుడూ నమ్మారు. పేద కూలీలకు, శ్రామికులకు, గిరిజనులకు ఎప్పటికీ అండగా నిలిచిన నాయకుడు. స్వాతంత్య్రం వచ్చాక ల‌చ్చ‌న్న లక్ష్యం పేదల సంక్షేమం. రైతులు, కూలీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వీరందరికీ న్యాయం చేయడమే ఆయన జీవన ధ్యేయం.

పదవుల కోసం ఆయన పోరాడలేదు, ప్రజల కోసం పోరాడారు. అసెంబ్లీలో, పార్లమెంటులో ఎన్ని సార్లు ఎన్నికైనప్పటికీ, ఆయన గళమెత్తింది ఎప్పుడూ బలహీన వర్గాల కోసం మాత్రమే. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన దృఢ సంకల్ప పోరాటానికి, ఆయనకు ‘సర్దార్’ బిరుదు లభించింది.

జెంటిల్మెన్ అగ్రిమెంట్ సమయంలో తెలంగాణ ప్రాంతానికి హామీలు ఇవ్వడంలో ఆయన చూపిన కట్టుబాటు ఆయన దూరదృష్టిని తెలియజేస్తుంది. పదవులు కోల్పోయే పరిస్థితి వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇది నిజమైన నాయకత్వానికి ఉదాహరణ. ఆయన జీవితం ఒక ప్రజాసేవా గాథ. తోటపల్లి జలాశయానికి ఆయన పేరు పెట్టడం చిన్న విషయం కాదు, ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో రాష్ట్రం గుర్తించిన చిహ్నం.

ఎన్జీ రంగా శిష్యుడుగా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర‌ను పోషించారు

ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కేంద్రబిందువు అని ఆయన ఎప్పటికీ నమ్మారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయన జీవితం అంతా ప్రజల కోసం అంకితం అయింది. సుదీర్థ కాలం శాస‌న‌స‌భ్యులుగా ప‌నిచేసి ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చార‌ని అన్నారు. 1978లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, పిఏసి ఛైర్మన్‌గా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా విశేష సేవలను అందించారని తెలిపారు. ఆయన తరం నాయకులు ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం వెనక్కి తగ్గలేదు.

అందుకే, ఆయన పేరు రాజ‌కీయ‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రజల కోసం పదవులు కాకుండా, ప్రజల కోసం త్యాగం చేయడం ఎలా ఉండాలో గౌతు ల‌చ్చ‌న్న గారు చూపించారు. ఎన్జీ రంగా గారి కోసం పార్ల‌మెంట్ స్థానానికి రాజీనామా చేసి అదే స్థానంలో ఎన్జీ రంగా ను గెలిపించుకొని గురుభ‌క్తిని చాటుకున్నాడ‌ని కొనియాడారు. ఆయ‌న త్యాగస్ఫూర్తి, సేవాసంకల్పం, ప్రజానుకూల ఆలోచనలు మనందరికీ చిరస్మరణీయాలు.

తన జీవితాంతం, ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని, యువతకు ప్రేరణగా నిలిచార‌ని అటల్ బీహారి వాజ్‌పేయి కూడా పేర్కొన్నారని తెలిపారు. ప్రకాశం పంతులు, బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు.

బీసీల అభివృద్ధికి తెలుగుదేశం క‌ట్టుబ‌డి ఉంది

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాల అభ్యున్నతికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, వారిని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బలోపేతం చేసే దిశగా కట్టుబడి ఉంది. తెలుగుదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు తొలిసారిగా బీసీలకు గౌరవప్రద స్థానాలు కల్పించి, వారికి రాజకీయ శక్తి ఇచ్చారు.

అందువల్లే ఆ మార్గాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు మరింత బలపరుస్తూ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు, వృత్తుల వారీగా అభివృద్ధి పథకాలు, విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి రంగంలోనూ బీసీలకు సమాన అవకాశాలు కల్పించడం తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. బీసీల పురోగతి లేకుండా సమాజ పురోగతి అసాధ్యం. బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమం శాఖ మంత్రి ఎస్. స‌విత‌, రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, గనులు & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ళ్లా శ్రీనివాస్, విజ‌యవాడ ఎంపీ కేసినేని చిన్ని, ప‌లాస ఎమ్మెల్యే గౌతు శిరీష‌, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ‌,పెడ‌న ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్, బీసీ సంఘ నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!