రైతులు ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ యార్డుకు తీసుకు రావాలని, మార్కెట్ యార్డ్ కు తెచ్చిన మొత్తం ఉల్లి కొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రైతులకు తెలియజేశారు. మంగళవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు.
ఈ సందర్భంగా పోలకల్ గ్రామం సి.బెళగల్ మండలం కు చెందిన తెలుగు వెంకట లక్ష్మమ్మ , సంఘాల గ్రామం , బెలగల్ మండలం నాయుడు , సనగండ్ల గ్రామం గూడూరు మండలం కు చెందిన భరత్ కుమార్ రెడ్డి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించారు. వీరితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…బాగుగా ఆరబెట్టిన మరియు గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకుని రావలసిందిగా మీ గ్రామాల్లో మీరు రైతులకు చెప్పాలని , తొందరపడి పచ్చిగా ఉన్న ఉల్లి తీసుకురావద్దని వారికి తెలియజేశారు.
కర్నూలు జిల్లాలో పండించే ఉల్లికి మంచి పేరు ఉన్నదని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత , అవసరం ఉన్నదని వారికి తెలియజేశారు. పచ్చిగా ఉన్న , గ్రేడింగ్ చేయని ఉల్లి దూర ప్రాంతాలకు వెళ్లే లోపల చెడిపోతుందని తెలిపారు. ఈ విధంగా పంపడం వలన మన కర్నూలు ఉల్లికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు.
తొందర పడవద్దు… గ్రేడింగ్ చేసి తీసుకురండి
గత సంవత్సరం దాదాపు దేశమంతా మన ఉల్లి అమ్మకం చేసామని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర మరియు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లలో ఉల్లి పంట బాగా పండటం వలన మన ఉల్లికి మంచి రేటు రావడం లేదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు కేజీ చొప్పున కొంటూ ఉన్నదని తెలిపారు. కావున రైతులు బాగా ఆరబెట్టినవి , గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డ్ కు తీసుకొని రావలసిందిగా కోరారు..
ఇటువంటి ఉల్లికి మంచి రేటు ఉంటుందని తెలియజేశారు . మార్కెట్ యార్డుకు తెచ్చిన ఇటువంటి ఉల్లిని తప్పక కొనడం జరుగుతుందని తెలిపారు. ట్రేడర్లు తక్కువకు కొన్నా, 12 రూపాయలు వచ్చేలా, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పండించే ఉల్లిని ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో రైతులు పండించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ మార్కెటింగ్ ఫెడరేషన్ శాఖ ఈ రోజు వచ్చిన ఉల్లి మొత్తం కొనడం మరియు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వారి ఆదేశాల మేరకు రైతులకు సబ్సిడీ ధరతో మధ్యాహ్న భోజనము 15 రూపాయలకు మరియు రాత్రి భోజనము 10 రూపాయలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.
ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ,జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య , కడప మార్కెట్ యార్డ్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు , డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ , కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు , కర్నూలు మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.