భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా? లడఖ్ లో జరుగుతున్న పోలీసు అణచివేత కార్యక్రమాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు అని లడఖ్ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ భార్య, హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ (HIAL) సీఈఓ గీతాంజలి జె. ఆంగ్మో ఆరోపించారు. గురువారం ఆమె కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 24న లడఖ్‌లో చోటుచేసుకున్న హింస అనంతరం ప్రజలపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బ్రిటీష్ కాలాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చిన ఆమె “1857లో 24,000 బ్రిటిషర్లు, 1.35 లక్షల భారతీయ సైనికులను ఉపయోగించి 30 కోట్ల భారతీయులను రాణి ఆజ్ఞతో అణచివేశారు. నేడు కొద్ది మంది పరిపాలకులు, 2,400 లడఖ్ పోలీసులను వాడి 3 లక్షల లడఖ్ ప్రజలను హింసిస్తున్నారు. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా భావించాలి” అని ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్టు చేశారు.
సోనం వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అదుపులోకి తీసుకోవడాన్ని గీతాంజలి ఖండించారు. ఆయనపై “పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సంబంధాలు కలిగారు” అనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని, పోలీసులు ఒక అజెండాతో పనిచేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. “డీజీపీ చెప్పేది అజెండా ప్రకారం మాత్రమే. వారు 6వ షెడ్యూల్ అమలు చేయాలనే ఉద్దేశ్యం లేదు.
ఎవరో ఒకరిని బలి చేయాలని చూస్తున్నారు” అని ఆంగ్మో ఆరోపించారు. యునైటెడ్ నేషన్స్ నిర్వహించిన వాతావరణ మార్పు సమావేశానికి, పాకిస్తాన్ డాన్ మీడియా సంస్థ కూడా హాజరైనట్లు గుర్తుచేస్తూ “అది ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్. భారత్ చైనాతో క్రికెట్ ఆడితే, క్రికెటర్లు దేశద్రోహులవుతారా? గ్లేషియర్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నందుకు ఎవరినైనా ISI ఏజెంట్‌గా ముద్ర వేయడం అన్యాయం” అని ఆమె ప్రశ్నించారు.
ఇక లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం లడఖ్ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం నిరసనలో ఉన్న నేతలతో చర్చలు జరుగుతున్నాయి. శాంతియుత వాతావరణం ఏర్పడగానే అధికారిక చర్చలు ప్రారంభమవుతాయి. నేను గత రెండు నెలలుగా ఇక్కడే ఉన్నాను. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజలతో కలిసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నాం” అని తెలిపారు.