లేటు వయసులో ఘాటు ప్రేమకు బలైపోయిన ఒక వృద్ధురాలి కథ ఇది. అమెరికాకు చెందిన 72 ఏళ్ల మహిళ రూపిందర్ కౌర్ పాంధేర్ కథ ఇది. ఆమె లూధియానా జిల్లా కిళా రాయ్‌పూర్ గ్రామంలో హత్యకు గురైంది.ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది.
అసలు విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. 72 ఏళ్ల రూపిందర్ కౌర్ పాంధేర్ 75 ఏళ్ల యూకే ఎన్ఆర్ఐ చరంజీత్ సింగ్ గ్రేవాల్ తో ప్రేమలో పడ్డారు. ఈ ముసలి వాళ్లిద్దరూ వివాహం చేసుకోవడానికి సియాటిల్ నుంచి పంజాబ్‌కు వచ్చారు. 75 ఏళ్ల యూకే ఎన్ఆర్ఐ చరంజీత్ సింగ్ గ్రేవాల్‌ను వివాహం చేసుకోవడానికి ఎన్నో కలలు కంటూ ఇండియాకు వచ్చిన ఆమెను మోసం చేసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ముఖ్య నిందితుడు సుఖ్జీత్ సింగ్ సోను పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. 75 ఏళ్ల వరుడు చెప్పిన విధంగానే జూలై 12-13 తేదీల రాత్రి రూపిందర్ కౌర్‌ను హత్య చేసినట్టు అతను అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెళ్లి పేరుతో పంజాబ్‌కు పిలిపించి భారీగా డబ్బులు ఆమె నుంచి వసూలు చేశారు. ఆర్థిక ప్రయోజనం కోసం ఈ హత్య జరిగిందని దర్యాప్తు అధికారులు తేల్చారు.
ఏసీపీ హర్జిందర్ సింగ్ గిల్, ఎస్ఎచ్‌ఓ సుఖ్జిందర్ సింగ్ వివరించిన ప్రకారం, సోను రూపిందర్ కౌర్‌ను చంపిన తర్వాత ఆధారాలు తుడిచిపెట్టే ఉద్దేశంతో తన ఇంట్లోని గదిలో డీజిల్ పోసి ఆమె శరీరాన్ని దహనం చేశాడు. అనంతరం నీళ్లు పోసి చల్లార్చి, మిగతా భస్మాన్ని లెహ్రా గ్రామం సమీపంలోని కాలువలో పారేశాడు.
పోలీసులు కొంతమేర అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకొని, బాధితురాలి గుర్తింపుకు ప్రయత్నిస్తున్నారు. జూలై 28న రూపిందర్ కౌర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన సోదరి కనిపించడం లేదని అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసిన తరువాతే కేసు వెలుగులోకి వచ్చింది.
అప్పటి వరకు రూపిందర్ కౌర్‌తో టెలిఫోన్ లో కూడా ఆమె మాట్లాడలేకపోయింది. తరువాత ఒక స్నేహితుడు సోను పోలీసుల కస్టడీలో ఉన్నాడని కుటుంబానికి తెలియజేయడంతో నిజం బయటపడింది. దర్యాప్తులో చరంజీత్ సింగ్ గ్రేవాల్ హత్యకు పన్నాగం పన్ని, నేరం చేసిన సోనుకు రూ.50 లక్షలు ఇస్తానని వాగ్దానం చేసినట్టు బయటపడింది. రూపిందర్ కౌర్, అదృశ్యం కావడానికి ముందు సోను మరియు అతని సోదరుడి ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న చరంజీత్ సింగ్‌పై ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. అతన్ని పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో చర్యలు కొనసాగిస్తున్నారు. సోను ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏసీపీ గిల్ ప్రకారం, ఇంకా మరిన్ని అవశేషాలు, పత్రాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో అధికారికంగా నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్నట్టు తెలిపారు.