మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో మాజీ RDO ఎం.సాకప్ప మురళికి సుప్రీంకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది.జూన్ 2న ఇచ్చిన మధ్యంత బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ మేరకు జస్టిస్ మనోజ్‌మిశ్ర, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
అసలు ఏం జరిగింది
2024 జులై 21న రాత్రి 11.25 గంటల సమయంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు ఫైల్స్ కాలిపోయాయి. మొదట్లో ఇది ప్రమాదమే అనుకున్నారు కానీ, తర్వాత వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనుమానితుల కాల్‌డేటాను విశ్లేషించి ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు.
మురళి 2022 అక్టోబరు నుంచి 2024 ఫిబ్రవరి 5వ తేదీ వరకు మదనపల్లెలో RDOగా పని చేశారు. అగ్ని ప్రమాదానికి 6 గంటల ముందు ఆ కార్యాలయానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్‌తో మాట్లాడి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు అతన్ని తొలుత సాక్షిగా పిలిచి వాంగ్మూలం రికార్డు చేసినప్పుడు తాను అక్కడకు వెళ్లినట్లు అంగీకరించారు.
తరచూ ఆఫీసుకు వచ్చి నిషేధిత భూముల గురించి ఈ కేసులో A-1, A-3గా ఉన్నవారితో చర్చించేవారని దర్యాప్తులో తేలింది. RDOగా పనిచేసేటప్పుడు 14 వేల ఎకరాల నిషేధిత భూముల క్రమబద్ధీకరణలో మురళి పాత్ర ఉన్నట్లు వెలుగుచూసింది. దాంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేయగా మొత్తం 48,360.12 ఎకరాల ఫ్రీహోల్డ్ భూమిలో 22,523.50 ఎకరాలను ఈయన హయాంలో అక్రమంగా క్రమబద్ధీకరించినట్లు తేలింది.
అధికారిక సమాచారాన్ని A-3 మాధవ్‌రెడ్డికి అందించినట్లు పోలీసులు గుర్తించి సోదాలు చేయగా, అక్కడ నిషేధిత భూముల రికార్డులు దొరికాయి. అవన్నీ ఈయనే ఇచ్చినట్లు పోలీసులు కాల్‌డేటా రికార్డ్ ద్వారా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులంతా కుమ్మక్కై సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సృష్టించి 2,400 దస్తావేజులు కాల్చేసి భూకుంభకోణానికి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు.
నిందితుడు మురళి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్ 10న పిటిషన్‌ను కొట్టేసింది. ఆ తీర్పును సవాల్‌చేస్తూ మే 15న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. తొలిసారి ఈ కేసు జూన్ 2న వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో ధర్మాసనం పిటిషనర్‌కు మధ్యంతర బెయిలిచ్చింది.
గురువారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు, అంతకుముందు ఇరుపక్షాలు దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత పెద్దిరెడ్డి పీఏ తుకారాం విదేశాలకు పారిపోయారు. ఏడాది గడిచినప్పటికీ తిరిగిరాలేదు. ఇదే కేసులో మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకటాచలపతి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, శశికాంత్ నిందితులుగా ఉన్నారు.