ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడలో జరగబోయే శ్రీ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించి వివరించారు. అనంతరం వినతి పత్రం అందించారు
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ ఏమన్నారంటే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు హైదరాబాదు – విజయవాడ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను కార్పొరేషన్ నిర్వహించనుంది. ఇందులో అమ్మవారి శీఘ్ర దర్శనం తో పాటు పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.ఈ సందర్భంలో, రూ.500 విలువ గల 60 శీఘ్ర దర్శన టిక్కెట్లు మంజూరు చేయాలని, అలాగే 12 సీటర్ల మినీ వాహనాలను గిరిపాదం నుండి ఆలయ ప్రాంగణం వరకు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఎండోమెంట్స్ శాఖకు విజ్ఞప్తి చేసారు.
భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆధ్యాత్మిక అనుభవం కలిగించే యాత్రా సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.