ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు.
జిల్లాల వారీగా ఎరువుల లభ్యత ఏ విధంగా ఉంది, సరఫరా ఎలా జరుగుతోందనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని అధికారులు వివరించారు. అవసరానికి తగ్గట్టుగానే ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంతమేర ఎరువులను సరఫరా చేస్తున్నారని చంద్రబాబు అడిగారు.
మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా పెంచండి
ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా దాదాపు 70 శాతం మేర ఎరువులు రైతులకు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.
భారీ స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు యూరియా, ఎరువుల స్టాక్ కూడా చెక్ చేయాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అలాగే ఎరువుల సక్రమ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో ఎరువులు, యూరియా సరఫరా విషయంలో జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం సూచించారు. పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలని… అదే సమయంలో ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే.. అలాంటి వారిని పసిగట్టి… తగు రీతిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎరువులు, యూరియా లభ్యత విషయంలో రైతులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు.
సమన్వయం చేసుకోవాలి…
స్థానిక అధికారులతో… జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు నిత్యం సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమలు, రవాణా, విజిలెన్స్, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో రోజువారీ పరిశీలన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్కడైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎరువులు బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కేసులు నమోదు చేయడానికి ఎక్కడా వెనుకాడొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధరలు పెంచి ఎరువుల అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎరువులను పక్కదారి పట్టించారని నిర్ధారణైతే… సదరు డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో సమాచారం అప్డేట్ ఏ మేరకు అవుతుందని ఆరా తీసిన సీఎం…ఐఎంఎఫ్ఎస్ పోర్టల్ లో రియల్ టైమ్ ప్రాతిపదికన సమాచారం అప్డేట్ కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు.
సాకులు చెప్పకుండా.. పోర్టల్లో సమాచారం నిరంతరం అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అత్యధికంగా ఎరువులు అమ్ముతున్న రిటైలర్లు… తరచుగా కొనుగోలు చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టు గుర్తిస్తే… అలాంటి వారి విషయంలో వెంటనే దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద సరిపడా నిల్వలు ఉండేలా చూసుకోవాని అధికారులను ఆదేశించారు. బయట ప్రైవేట్ డీలర్ల కంటే.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. రిటైల్ కేంద్రాల వద్ద కానీ.. పీఏసీఎస్ ల వద్ద కానీ యూరియా, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.