మహిళల కోసం స్త్రీ శక్తి పేరిట కూటమి సర్కార్ ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీం సూపర్ సక్సెస్ అయింది. పథకం ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 65 లక్షల మందికిపైగా మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారం రోజుల్లో ఎక్కడా కూడా చిన్న గొడవ కానీ, వివాదం కానీ చెలరేగలేదు. సాఫీగా ప్రయాణాలు జరిగాయి. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు.
ఇక, త్వరలోనే లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు మంత్రి రాంప్రసాద్. సూపర్ – 6లో భాగంగా తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకం సక్సెస్‌ఫుల్ అయిందన్నారు. స్త్రీశక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యత అని అని చెప్పుకొచ్చారు. ఘాట్ రోడ్‌లోనూ ఫ్రీ బస్ సేవలు అందిస్తున్నామన్నారు. ఇక తిరుమలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామన్నారు. ఇక తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఫ్రీ బస్ విషయంలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. సంస్థ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకుంటామని, కార్గో సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఏపీలో ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల ప్రభుత్వం ఏటా 2000 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఈ పథకం కింద, మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు రాష్ట్రంలోని 5 రకాల బస్సుల్లో – పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2 కోట్ల 62 లక్షల మంది మహిళలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.