కొందరు మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకుంటున్నారని, సమాజం లోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను విక్రయించే లేదా వినియోగించు వారి వివరాలను పోలీసు శాఖ కు అందించి అలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ సూచనలతో అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు “నషా ముక్త్ భారత్ అభియాన్” లో భాగంగా జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో బుధవారం యాంటి డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ సమాజంలో యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలు హత్యలకు సైతం పాల్పడుతూ, మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్లు గుర్తించినా లేదా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలుగన్న వారి కలలను కల్లలుగా చేస్తున్నారని, మత్తు పదార్థాలు సేవించడం వల్ల మైండ్ తో పాటు, విచక్షణా శక్తిని కోల్పోతున్నారని, సామాజిక ,మానసిక, శారీరక, అనారోగ్యాలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు. పోలీసు యంత్రాంగం గంజాయి, ఇతర నిషేదిత మత్తు పదార్థాలు ఏ మూల విక్రయించినా దాడులు నిర్వహిస్తు, రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారని, గంజాయి ఎక్కడెక్కడ ఉందో వాటి మూలాలకు వెళ్లి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రాణాంతకమైన మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు ‘నో’ చెప్పేలా పోలీస్ శాఖకు సహకరించి యువత బంగారు భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాదకద్రవ్యాల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్బంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసు శాఖకు తెలియచేస్తానని ఉన్నత పాఠశాలలు/కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు.