తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం వెనుక రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నది. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
గోవా లోకాయుక్త తొలి చైర్మన్ గా సేవలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బీట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రం శాశ్వత ట్రస్టీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామం ఆయన స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీ లో న్యాయ విద్య అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో న్యాయవాదిగా ప్రారంభించి 1988లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు.
1993లో హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. తరువాత గౌహతి న్యాయమూర్తిగా అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి పదవీ విరమణ పొందారు. రాజ్యాంగ సమస్యలపై ఆయన ఇచ్చిన తీర్పులు ఎన్నో సంచలనం అయ్యాయి. నల్ల ధనం కేసులపై ఆయన వెలువరించిన తీర్పులు చరిత్రలో నిలబడిపోతాయి. మానవ హక్కుల కోసం ఆయన తన స్వరం వినిపిస్తూ వచ్చారు.
మావోయిస్టులను పట్టుకునేందుకు ఛత్తిస్ఘడ్ ప్రభుత్వం ట్రైబల్స్ తో కోయ జుడుం ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. హైదరాబాద్ కేంద్రంగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు.
NDA కూటమి అభ్యర్థి తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే అనుకున్న సమయంలో ఇండియా కూటమి ఎత్తుగడల్లో భాగంగా తెలంగాణ అభ్యర్థిని రంగంలోకి దించింది. దీనివెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఉందని అంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు అనివార్యమైంది.
రెండు కూటములు దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులనే ఖరారు చేశాయి. బిజెపికి మానవ హక్కుల నేత మధ్య జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ గాంధీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి గెలుస్తారని కాదు కానీ, మొత్తానికి ఒక పోటీ వాతావరణం తీసుకొచ్చారు. గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.