టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. కఠినంగా కనిపిస్తారు. ఐతే ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో ఆయన మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఓ తండ్రిగా తానూ గర్వపడుతున్నానంటూ చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.
మంగళగిరిలో 1985లో చివరిసారిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి M.S.S కోటేశ్వర రావు గెలిచారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.మంగళగిరిలో 2024లో లోకేష్ గెలిచేంత వరకు టీడీపీ జెండా ఎగరలేదన్నారు. 2019 ఎన్నికల నాటి సందర్భాన్ని సైతం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తానని చెప్పాడని, కానీ అక్కడ పార్టీ కేడర్ లేకపోవడంతో ముందుగానే హెచ్చరించానని చెప్పారు చంద్రబాబు. ఐతే భయపడినట్లే ఆ ఎన్నికల్లో లోకేష్ 5 వేల ఓట్లతో ఓడిపోయాడన్నారు. కానీ ఆ ఓటమితో లోకేష్ కుంగిపోలేదన్నారు చంద్రబాబు. ఓడిన అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవాలని ఆ రోజే దృఢ సంకల్పం తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఆ నిర్ణయం ప్రకారమే..2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91 వేల 413 ఓట్ల మెజార్టీ సాధించాడంటూ చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, మంగళగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చాడంటూ ప్రశంసించారు. ఈ సమయంలో చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడుతూ లోకేష్ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు.