హైదరాబాద్ హోమ్

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టు

#BJPPresident

హైదరాబాద్‌లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు మోయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ పిలుపుని అడ్డుకునేందుకు ఉదయం నుంచే పలువురు నేతలను నిర్బంధించారు.

కొందరు కార్యాలయానికి చేరుకున్న తర్వాత అరెస్టయ్యారు. రాంచందర్ రావు, మరికొందరు నాయకులు హైదరాబాద్‌కి వస్తున్నప్పుడే మోయినాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన అరెస్టుపై రాంచందర్ రావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో స్పందించారు. తాను చెవెళ్ల సందర్శనలో ఉండగా అరెస్టు చేశారని, ఇది ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కే ప్రభుత్వ యత్నమని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ “గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. రోడ్లు గోతులమయమైపోయాయి. ట్రాఫిక్ నియంత్రణ లేదు. చెత్త దుర్వాసనతో కాలనీలు నరకయాతన అనుభవిస్తున్నాయి. తాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు రోజువారీ పోరాటాలుగా మారాయి. రామంతాపూర్, పాతబస్తీలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే అని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ “ప్రజా సేవ కన్నా ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మున్సిపల్ పరిపాలన మంత్రిగా ఆయనకు ప్రజా సేవ కాదని, కమీషన్లే ముఖ్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అణచిపెడుతోందని దుయ్యబట్టారు. సెక్రటేరియేట్ ముట్టడించకుండా పోలీసుల బందోబస్తు కఠినతరం చేశారు.

కొందరు బీజేపీ నాయకులు సచివాలయం ప్రధాన గేటు ఎక్కే ప్రయత్నం చేశారు. వారిని కూడా అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాంచందర్ రావు నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు బీజేపీ నాయకులను అరెస్టు చేస్తోందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Related posts

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!