రాజకీయాల్లో నిన్నటి విమర్శకులే నేటి అనుమానస్తులు. ఈ సిద్ధాంతానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక సజీవ ఉదాహరణ. ‘ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం లేకుండా వరుసగా బీజేపీ గెలవడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను పెంచుతుంది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. అయితే, ఈ అనుమానాలకు మూల కారణం ఎక్కడ ఉందనేది రాహుల్ గాంధీ గమనిస్తే, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కాస్త ఆలోచించేవారేమో!
రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు మొదటగా ఎప్పుడు పుట్టుకొచ్చాయి? 2009లో. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ బలం 2004 నాటి 145 స్థానాల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఈ అనూహ్యమైన పెరుగుదల అప్పట్లో ప్రతిపక్షాలకు (బీజేపీతో సహా) ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా, యూపీఏ నుంచి విడిపోయిన లెఫ్ట్ పార్టీలు కూడా ఈవీఎంలపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ‘ఈవీఎంల విజయం’ పట్ల ఉత్సాహం ప్రదర్శించిన తీరు ఇప్పుడు రాహుల్ గాంధీకి గుర్తు ఉండకపోవచ్చు.
ఉమ్మడి ఆంధ్రాను 2009లో ఎన్నికల పోలింగ్ కోసం రెండుగా విభజించి, మొదటి దఫాలో తెలంగాణలో పోలింగ్ పూర్తిచేసి, మలి దఫాలో ఆంధ్రాలో పోలింగుకు ముందు ఆంధ్రా వాళ్లు హైదరాబాద్ రావాలి అంటే పాస్పోర్ట్ తీసుకురావాలి అని వైఎస్ రాజశేఖరరెడ్డి నోటితో రెచ్చగొట్టే వాఖ్యలు చేయించింది అందరికీ గుర్తుంది. అలా ఒక వ్యూహాత్మక ప్రణాళిక అనుసరించి, ఇక మనకు ఎదురులేదనుకొని, వైఎస్సార్ ఆకస్మికంగా దుర్మరణం చెందాక, అన్యాయమైన విభజన చేసి ఆంధ్రాలో.. తెలంగాణలో కలిపి సున్నం పెట్టుకొంది. కేంద్రంలో అధికారానికి అవసరమైన ఓటు బ్యాంకును ఆంధ్రాలో.. నాశనం చేసుకొని, ఇప్పటికీ చేసిన పాపం దానికి గుర్తుకురావడం లేదు. చంద్రబాబు కోసం రాష్ట్రం మీద పగబట్టిన ప్రతిపార్టీకి దేశం సరిగ్గానే బుద్దిచెబుతోంది.
ఇకపోతే మరో విషయం గుర్తుచేసుకోవాలి. ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టడంలో పీవీ నరసింహారావు హయాంలో టీ.ఎన్.శేషన్ కృషిని ఎవరూ కాదనలేరు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మళ్ళీ వెనక్కి తిరిగాయి. దీనికి ప్రధాన కారణం, నవీన్ చావ్లా వంటి తమకు అనుకూలుడైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమించడం. ఈ నియామకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నవీన్ చావ్లా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ రోజుల్లో తమకు అనుకూలుడైన వ్యక్తిని నియమించుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్వతంత్రత గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… ఇప్పుడు ఒకలా…
ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకప్పుడు తమకేమాత్రం వర్తించదని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే వ్యతిరేకత తమ వ్యతిరేక పార్టీకి వర్తిస్తుందని గ్రహించింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే వ్యవస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఇది కేవలం ఎన్నికల వ్యవస్థపై అనుమానం కాదు, తమ పట్టు కోల్పోతున్నామనే అసహనం.
ప్రజాస్వామ్య విలువలను గురించి మాట్లాడేటప్పుడు, మొదటగా తమ పార్టీ గతాన్ని గుర్తు చేసుకోవాలి. నిన్నటి తప్పుల నుంచి పాఠం నేర్చుకోకుండా, కేవలం నేటి ఓటముల గురించి మాట్లాడటం అనేది ఆయన కాంగ్రెస్ కు చేస్తున్న అన్యాయం అవుతుంది. రాజకీయ నాయకులకు, వారి విమర్శలకు ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని అర్థం చేసుకోవడానికి ఒకసారి చరిత్ర పుటలను తిరగేస్తే సరిపోతుంది.
దానితో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల తాజా పోరాటాలు చూసి అది నేర్చుకోవాలి. తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ డీఎన్ఏ వున్న వైకాపా ఓట్లను ఎలా చేర్చింది, ఎలా తీసేసింది, ఏకంగా గుర్తింపు కార్డుల వరకు ఎలా స్కామ్ చేసి ఒక ట్రయల్ వేసి, రాష్ట్రం అంతా ఎలా అమలుచేసి వైనాట్ 175 చెయ్యాలని ఊగిపోయింది, దాని మీద టిడిపి ఎలా పోరాటం చేసింది, ఆ ఓట్ల మీద ఎన్ని ఫిర్యాదులు చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుట్ర మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా ఓటర్ల లిస్టు మీద ఎలా కష్టపడి చెక్ పెట్టి చిత్తుచేసింది అనేదానిని ఒక కేస్ స్టడీలా అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాలలో పోరాడాలి. మైకుల ముందు చెబితే సానుభూతి తప్ప ఏమీ జరగదు.