ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ మరో పెద్ద తప్పు చేస్తున్నారా అంటే ఔను అనే సమాధానం వస్తున్నది. ఎన్డీఏ, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు, ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించి నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ తాజా నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. బిఆర్ఎస్- బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం ఉండడం పరోక్షంగా బిజెపికి మేలు చేయడం మాత్రమే అని చెడ్డీలు వేసుకొని రాజకీయాలను టీవీలో చూసే పిల్లవాడికి కూడా తెలుసు అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఇదే బిఆర్ఎస్- బిజెపి అసలు స్వరూపమని కూడా సామా విమర్శించారు.