ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి 200 పేజీలతో సిట్ ఏసీబీ కోర్టులో రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రెండో చార్జ్‌షీట్‌లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలు పొందుపరిచారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అప్పటి కార్యదర్శి, ఇప్పటి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీసిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పాత్రపై ఈ చార్జిషీట్ లో వివరాలు పొందు పరిచారు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకే మద్యం విధానం మార్పు జరిగినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు. మద్యం విధానంలో మార్పుల కోసం సిండికేట్ సమావేశాలు, ముడుపుల కోసం మీటింగ్ వ్యవహారం జరిగినట్లు సిట్ అధికారులు నిర్థారణకు వచ్చారు. మద్యం విధానం మార్పు, అమలు, కమీషన్లు సహా ఇతర వ్యవహారాలను గత సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత వీటిని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. మద్యం ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి.. బ్లాక్‌ను వైట్‌గా ఎలా మార్చాలనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేశారు. ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డు, గూగుల్ టేకాట్ సహా ల్యాప్‌టాప్‌ల్లోని వివరాలను రెండో చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.