బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈసారి బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని మాట్లాడుతూ, “ఈసారి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్‌డీఏ అన్ని గత రికార్డులను బద్దలు కొడుతుంది. బీహార్ ప్రజలు ఎన్‌డీఏకు ఇప్పటివరకు లభించని భారీ మెజారిటీని అందిస్తారు,” అని అన్నారు. మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి పాలనకు ఓటు వేయాలని, అశాంతి, అవినీతి పాలనకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
“ప్రజాస్వామ్య మహోత్సవం బీహార్‌లో ప్రారంభమైంది. మొత్తం బీహార్ ఒకే స్వరంతో చెబుతోంది ‘ఫిర్ ఏక్ బార్ ఎన్‌డీఏ సర్కార్, ఫిర్ ఏక్ బార్ సుసాసన్ సర్కార్’. జంగిల్‌రాజ్ వాలోం కో దూర్ రఖేగా బీహార్,” అని ఆయన నినదించారు. బీహార్ అభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను వివరించిన మోదీ, గత పదేళ్లలో బీహార్‌లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.
ఈ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే ఎన్‌డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమివ్వాలని కోరారు. ప్రజల ఆశలు, అభీష్టాలను నెరవేర్చే ప్రభుత్వం కావాలంటే స్థిరత్వం అవసరమని, నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ మరింత ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. సమస్తిపూర్ సభలో పెద్ద ఎత్తున జనసందోహం హాజరై “మోదీ, మోదీ”, “నితీశ్ జీ జిందాబాద్” నినాదాలతో మార్మోగింది.
