ఉత్తరప్రదేశ్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. బాగ్‌పట్‌లో నకిలీ ఫైనాన్స్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిన ఘటనలో బాలీవుడ్ నటులు శ్రేయాస్ తల్పాడే, అలొక్‌నాథ్‌తో సహా 22 మంది మీద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అదనపు పోలీస్ అధికారి (ASP) ప్రవీణ్ సింగ్ చౌహాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘అర్బన్ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ అనే సంస్థ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్, మీరట్, ఘాజియాబాద్ జిల్లాల్లో తమ ఏజెంట్ల ద్వారా పెట్టుబడి పథకాలు నిర్వహించింది. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించడానికి బాలీవుడ్ ప్రముఖులను వినియోగించిందని అధికారులు తెలిపారు.
శ్రేయాస్ తల్పాడేను కంపెనీ ప్రమోటర్‌గా, అలొక్‌నాథ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రదర్శించి ప్రజల్లో విశ్వాసం పొందేలా ప్రచారం సాగించిందని చౌహాన్ వివరించారు. “ఒక సంవత్సరంలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని హామీ ఇచ్చి వందలాది మందిని మోసం చేశారు” అని ఆయన అన్నారు.
ఇలా ప్రచారంపై నమ్మకంతో 500 మందికి పైగా పెట్టుబడిదారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని పోలీసులు తెలిపారు. అయితే ఒక సంవత్సరం పూర్తయ్యాక, తమ డబ్బు తిరిగి ఇవ్వమని పెట్టుబడిదారులు కోరగా కంపెనీ కార్యాలయం మూసివేసి నిర్వాహకులు పరారైనట్లు తెలిసింది.
బాగ్‌పట్ జిల్లాకు చెందిన బాబ్లీ అనే మహిళ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంపెనీ అధికారులు పెట్టుబడిదారుల సంతకాలను నకిలీగా తయారు చేసి డబ్బును దోచుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పాటు మరికొన్ని దరఖాస్తులు అందిన నేపథ్యంలో పోలీసులు 22 మంది నిందితులపై మోసం, నకిలీ పత్రాల సృష్టి, కుట్ర నేరాలకు సంబంధించిన ఆధారాల కింద కేసు నమోదు చేశారు.
“నిందితులందరి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నాం. సంస్థకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ఖాతాలపై విశ్లేషణ కొనసాగుతోంది. ఈ మోసంలో సినీ ప్రముఖుల పాత్ర ఎంతవరకు ఉందో కూడా విచారణలో భాగంగా ధృవీకరిస్తాం” అని ప్రవీణ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ప్రస్తుతం కంపెనీ ప్రధాన నిర్వాహకులు ఎక్కడ ఉన్నారన్న దానిపై పోలీసులు గాలింపు చేపట్టగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ఏజెంట్లు, ప్రచారదారులు, ప్రమోటర్లను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు నియమించబడ్డాయి. నకిలీ ఆర్థిక సంస్థల పేరిట సామాన్య ప్రజలను మోసం చేసే సంఘటనలు వరుసగా జరుగుతున్న తరుణంలో ఈ ఘటన మళ్లీ ఆర్థిక భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
