అగ్ని వీర్ పాలసీలో భారీ మార్పులు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం కేవలం 25 శాతం అగ్నివీరులను మాత్రమే శాశ్వతంగా సైన్యంలో నియమించుకునే విధానం అమలులో ఉంది. దీన్ని 75 శాతానికి పెంచాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
భారత సాయుధ దళాల్లో 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తలపెట్టిన ఈ మార్పుల ప్రకారం, ఇప్పటి వరకు నాలుగేళ్లు సేవలందించిన తర్వాత కేవలం 25 శాతం అగ్నివీరులను మాత్రమే శాశ్వతంగా నియమించుకునే విధానం అమలులో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో 75 శాతం అగ్నివీరులు సైన్యంలో కొనసాగేలా మార్పులు చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయిలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అగ్నిపథ్ పథకం ప్రారంభమైన తరువాత యువతలో మిశ్రమ స్పందన కనిపించడంతో పాటు, కొన్నిచోట్ల నిరసనలు కూడా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువత ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, సైన్యంలో నైపుణ్యంతో కూడిన సిబ్బందిని కొనసాగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవచ్చని అంచనా. ప్రస్తుతం అగ్నివీరులు నాలుగేళ్ల ఒప్పందంపై సైన్యంలో పనిచేస్తున్నారు.
ఈ కాలం అనంతరం వారిలో 25 శాతం మందిని మాత్రమే శాశ్వత సైనికులుగా కొనసాగిస్తుండగా, మిగతా 75 శాతం మంది స్వచ్ఛంద సేవా విరమణ పొందుతున్నారు. అయితే, రాబోయే మార్పులతో ఈ నిష్పత్తి తారుమారవుతుంది. అంటే, ఎక్కువమంది అగ్నివీరులు తమ సైనిక ఉద్యోగాలను కొనసాగించేందుకు అవకాశం దక్కనుంది. అధికార వర్గాల ప్రకారం, అగ్నివీరుల శిక్షణ, క్రమశిక్షణ, సేవా నిబద్ధత వంటి అంశాలు పరిశీలనలో భాగమని, వారిలో చాలా మంది మంచి పనితీరును ప్రదర్శిస్తున్నారని తెలిపారు.
అందువల్ల వారిని పూర్తిస్థాయి సైనికులుగా కొనసాగించడం ద్వారా దళాల బలం పెరగడమే కాకుండా, అనుభవజ్ఞులైన సిబ్బంది సైన్యంలో కొనసాగుతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదన అమలుకు తుది ఆమోదం లభిస్తే, అగ్నిపథ్ పథకంపై వచ్చిన విమర్శలు తగ్గి, యువతలో మళ్లీ సైనిక సేవలపై ఉత్సాహం పెరిగే అవకాశముంది. కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని రక్షణ వర్గాలు సూచిస్తున్నాయి.
