పటిష్ఠ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని పొదలకూరు పీఏసీఎస్ ఛైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, పొదలకూరు ఎస్.ఐ హనీఫ్ అన్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ (న్యూఢిల్లీ) సౌజన్యంతో అమ్మ మహిళా సేవా సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విజ్ఞాన్ కాలేజీలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లిఖార్జున్ నాయుడు, రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య, ఆకులూరు విజయ్, టీడీపీ నాయకులు అలుపూరు శ్రీనివాసులు, పెంచల నాయుడు పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ , చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పొదలకూరు లో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు, సహకరించిన నాయకులకు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత, దేశ సమగ్రతకు పెద్ద పీట వేస్తోందన్నారు. దేశ అభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాతల సహకారాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను రెండేళ్ళ పాటు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం అంటే కేవలం వేదికలపై ప్రదర్శించే పుస్తకం కాదని.. అందులోని విషయాలను పూర్తి భక్తితో పాటించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో మాత్రమే జరుపుకునే సెలబ్రేషన్స్ కాదని.. దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ మహిళా సేవా సమాజ్ ప్రెసిడెంట్ సుమతి, సెక్రటరీ అహ్మద్, ప్రిన్సిపాల్ ఏ.సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ సీ.హెచ్.కృష్ణ, ఏ.చంద్ర శేఖర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.