మహబూబ్ నగర్ హోమ్

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

#SLBC

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన కార్మికుల ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ అసమర్ధతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనకు తొమ్మిది నెలలు దాటినా, సంబంధిత శాఖలు ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. 2025 ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో తవ్వకాలు జరుగుతున్న సమయంలో కప్పు పై భాగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్‌లో ఇరుక్కుపోయారు.

ఆ తరువాత మనోజ్ కుమార్, గురుప్రీత్ సింగ్ అనే ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీయగా, మిగతా ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఘటన తర్వాత 2025 ఏప్రిల్ 5 వరకు కూడా గణనీయమైన పురోగతి లేకుండా విచారణ, రక్షణ చర్యలు ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది.

ఈ ఘటనపై ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు దాఖలు చేశారు. దానిని విచారించిన కమిషన్ 2025 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఆ ఆదేశాలను ఇరిగేషన్‌ శాఖకు బదిలీ చేసి, స్వయంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తదనంతరం ఇరిగేషన్‌ శాఖ సమర్పించిన నివేదికను కమిషన్ అసంతృప్తిగా పరిగణించింది. నివేదికలో పారదర్శకత లేకపోవడం, కార్మికుల రక్షణ చర్యలలో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయని కమిషన్ పేర్కొంది.

గల్లంతైనవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్‌, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సన్నీ సింగ్‌, జార్ఖండ్‌కు చెందిన సందీప్ సాహు, జగ్తా, సంతోష్ సాహు, అనుజ్ సాహు అనే కార్మికులు ఉన్నారు. వీరు అంతర్రాష్ట్ర వలస కార్మికులు కావడంతో, “అంతర్రాష్ట్ర వలస కార్మికుల నియంత్రణ మరియు పని పరిస్థితుల చట్టం” ప్రకారం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు విస్మరించబడ్డాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది.

అసంఘటిత కార్మికుల సంరక్షణ చట్టం ప్రకారం రక్షణ చర్యలు, ప్రమాద నివారణలో స్పష్టత లేకపోవడం, నివేదికలు అస్పష్టంగా ఉండడం వల్ల పరిస్థితిని అంచనా వేయడం కూడా కష్టమైందని కమిషన్ అభిప్రాయపడింది.

తాజాగా అక్టోబర్ 19న జరిగిన విచారణలో జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును అత్యవసర చర్యలు చేపట్టి నాలుగు వారాలలోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. టన్నెల్‌లో మిగిలిన కార్మికుల ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వంపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని కమిషన్ హెచ్చరించింది.

Related posts

శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Satyam News

Leave a Comment

error: Content is protected !!