తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూదితో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతిపూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. అక్టోబర్ 22, 23 తేదీలలో గణపతి స్వామి వారి హోమం జరుగనుంది.
అక్టోబర్ 24 – 26 వరకు శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :
అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. అక్టోబర్ 27న దక్షిణమూర్తి హోమం అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.
29న కాలభైరవ హోమం జరుగనుంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 07వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం (చండీహోమం), నవంబరు 08 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం) నిర్వహించనున్నారు. నవంబరు 18న మహా శివరాత్రి, శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు.
గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. నవంబర్ 19న ధర్మ శాస్త్ర హోమం, నవంబర్ 20వ తేదీన శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ కె. పి. చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.