చిత్తూరు హోమ్

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

#Tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రపంచంలోని తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలన్నారు. రాష్ట్రంలో 5 వేల వేంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలని టీటీడీకి సూచించారు.

టీటీడీ నిర్వహణలో ఉన్న ప్రతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు టీటీడీ పాలకమండలిని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో సింఘాల్ తో కలిసి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వరస్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు.

స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి… స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు.

అన్ని దేవాలయాల్లో అన్నదానం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ..”ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన హయాంలో తిరుమలలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అన్నదానం కింద రూ. 2283 కోట్లు కార్పస్ ఫండ్ ఉంది. ప్రతి నెలా రూ. 12 కోట్లు ఖర్చు అవుతుంది.

రూ. 14 కోట్లు వడ్డీగానే వస్తుంది. కార్పస్ ఫండ్ మీద వచ్చే వడ్డీతోనే అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమలలో నిర్వహిస్తున్న అన్నదానం తరహాలోనే టీటీడీ నిర్వహణలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టాలి. దానికి శ్రీకారం చుట్టాలని టీటీడీ పాలకమండలిని కోరుతున్నాను.” అని సీఎం చెప్పారు.

వేంకటేశ్వరుణ్ణి కొలుచుకునే భాగ్యం అందరికీ దక్కాలి

“వేంకటేశ్వర స్వామి దేవాలయాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉండాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ దేవాలయాలు ఉండాలి. ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఉంటే… ఆయా ప్రాంతాలు అన్నింటిల్లోనూ వేంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలి. ఆయా ప్రాంతాల్లోని స్థానికులతో కమిటీలు వేసుకుని ప్రపంచ వ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి దేవాలయాలను నెలకొల్పేలా చూడాలి.

ఆ దేవాలయాలన్నింటినీ తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుసంధానం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. శ్రీవాణి ట్రస్టుకు మొత్తంగా ఇప్పటి వరకు రూ. 2038 కోట్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.738 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. వడ్డీ రూపంలో రూ. 268 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా రూ.2306 కోట్లు శ్రీవాణి ట్రస్టు వద్ద ఉన్నాయి.

శ్రీవాణి ట్రస్టు నిధుల నుంచి వివిధ కార్యక్రమాల నిమిత్తం ఇప్పటి వరకు రూ.602 కోట్లను టీటీడీ ఖర్చు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ఉన్న ప్రాంతాల్లోని వారికి కూడా వేంకటేశ్వర స్వామిని కొలుచుకునే అవకాశం కల్పించాలి. ఇందు కోసం 5 వేల దేవాలయాలను నిర్మించాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి దేవాలయాల నిర్మాణం కోసం అవసరమైతే నేనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయంగా లేఖలు రాస్తాను. దాతలు ముందుకు వస్తే విరాళాలు తీసుకుందాం. అవసరమైతే మనమూ ఖర్చు పెట్టి దేవాలయాలను నిర్మిద్దాం.” అని చంద్రబాబు అన్నారు.

ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు లక్ష్యం నెరవేరాలి

“గతంలో నా హయాంలోనే ప్రాణదానం ట్రస్ట్ ప్రారంభించాం. నాకు వేంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టిన రోజున ఈ ట్రస్ట్ ప్రారంభించాం. ప్రాణదానం ట్రస్టుకు ఇప్పటి వరకు రూ. 709 కోట్లు రాగా… రూ.21 కోట్లను టీటీడీ ఖర్చు పెట్టింది. ఇంకా రూ.688 కోట్లు ఈ ట్రస్ట్ వద్ద ఉన్నాయి. ప్రాణదానం ట్రస్ట్ ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించామో.. ఆ ఉద్దేశ్యానికి తగ్గట్టు ఖర్చు పెట్టాలి. వేంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రాంతంలో వైద్య సేవలందించే నిమిత్తం ప్రాణదానం ట్రస్ట్ ప్రారంభించాం.

అలాగే శ్రీవారి సేవకుల కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించాం. ఇప్పటికి ఈ 12 లక్షల మంది స్త్రీలు, 5 లక్షల మంది పురుషులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. మొత్తంగా 17 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. ఈ శ్రీవారి సేవకులను పూర్తి స్థాయిలో నెట్ వర్క్ చేయాలి. వారి సేవలను వినియోగించుకోవాలి. వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి. వీరిని ఉపయోగించుకుని శ్రీవారి ప్రాభవాన్ని, విశిష్టతను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి.” అని చంద్రబాబు వివరించారు.

వేంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టాడు… ప్రజల కోసమే పని చేస్తా

“ఎవ్వరికీ ఇవ్వని అవకాశం వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. 14 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని ఆ దేవదేవుడు నాకు కల్పించాడు. ప్రపంచం మొత్తం కొలిచే దేవుడు, కష్టాలు కడతేర్చే దేవుడు వేంకటేశ్వర స్వామి. 22 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజునే నాకు వేంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. మంచి చేయడం కోసమే భగవంతుడు నన్ను బతికించాడని నేను భావిస్తాను.

ఇక్కడ ప్రతి ఒక్కరూ పవిత్ర భావంతో పని చేస్తున్నారు… దీన్ని కొనసాగించాలి… పవిత్రతను కాపాడుతూనే… వేంకటేశ్వర స్వామి వైభవాన్ని నలుదిశలా చాటాలి. తిరుమల కొండల్లో నిత్యం పచ్చదనం ఉండాలి. టీటీడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 80 శాతం గ్రీనరీ ఉంది. వేంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రాంతాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి. పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలు సుఖ సంపదలతో ఆనందంగా ఉండాలని వేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తదితరులు ఉన్నారు. అదే విధంగా పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్లు కూడా హాజరయ్యారు.

Related posts

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!