విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, క్యూ లైన్లలో భక్తులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, “శ్రీ బాలాత్రిపురసుందరీ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్సవాల ఏర్పాట్లు ఎంతో బాగున్నాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించారు” అని తెలిపారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని, ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లపాటు కొనసాగాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంపై సైకోలు కళ్ళు పడకూడదని కూడా దుర్గమ్మను వేడుకున్నట్టు ఆమె తెలిపారు.