రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ తీగల దగ్గర నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
“వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లే ముందు వాతావరణ సమాచారాన్ని పరిశీలించాలి,” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు