బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దాంతో ఎన్నికల వేడి పెరిగిపోయింది. పొత్తుల కోసం పార్టీల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం చిక్కుముడిలా మారింది. పెద్ద పార్టీల కూటముల్లో చిన్న పార్టీలు పెట్టే షరతులు తలనొప్పిగా తయారయ్యాయి. రెండు ప్రధాన కూటములు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA), మహా ఘట బంధన్ (Grand Alliance) రెండింటిలోనూ సీట్ల పంపకాలపై అసంతృప్తి నెలకొంది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో లోక్ జనశక్తి పార్టీ (LJP) పెద్ద తలనొప్పిగా మారింది. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ, నితీశ్ కుమార్ సారథ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా జేడీయూ పోటీ చేసే స్థానాల్లో తాము కూడా పోటీ చేస్తామని ప్రకటించింది.
నితీశ్ కుమార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఎల్జేపీ భావిస్తోంది. గతంలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఎల్జేపీ ఇప్పుడు ఏకంగా 43 సీట్లు కావాలని పట్టుబడుతోంది. బీజేపీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం జేడీయూతోనే సమస్య అని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేస్తున్నారు.
ఇది బీజేపీకి ఇరకాటంగా మారింది. ఒకవైపు నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, మరోవైపు చిరాగ్ పాశ్వాన్‌ను బుజ్జగించలేక సతమతమవుతోంది. నితీశ్ కుమార్ బలాన్ని తగ్గించేందుకే బీజేపీ ఈ తెరవెనుక కథ నడిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాఘటబంధన్ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) ఈ కూటమిని వీడి నితీశ్ కుమార్ వైపు వెళ్లిపోయింది. ఇప్పుడు మరో రెండు కీలక పార్టీలు బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP), ముఖేశ్ సహానీకి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఆర్జేడీ తమను తక్కువ చేసి చూస్తోందని, తగినన్ని సీట్లు కేటాయించడం లేదని ఈ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్జేడీ పెద్దన్న పాత్ర పోషిస్తోందని, తమను గౌరవించడం లేదని కుష్వాహా బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య కూడా సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఈ చిన్న పార్టీలు మరో ప్రత్యామ్నాయ కూటమి వైపు చూస్తున్నాయి.
బీహార్ రాజకీయాల్లో చిన్న పార్టీల ప్రభావం ఎక్కువ. 30శాతం వరకూ ఓటు బ్యాంకు వున్న కొన్ని కులాలే బీహార్ ఎన్నికల ఫలితాల్ని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, ఎల్జేపీకి పాశ్వాన్ల ఓట్లు, ఆర్ఎల్ఎస్పీకి కుష్వాహా (కోయిరి) ఓట్లు, వీఐపీకి మత్స్యకార వర్గం ఓట్లు కీలకం. ఈ ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయగలవు.
అందుకే, ఈ చిన్న పార్టీలను వదులుకోవడానికి పెద్ద పార్టీలు ఇష్టపడవు. ఇదే అదనుగా చిన్న పార్టీలు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తూ బేరసారాలు ఆడుతున్నాయి. ఈ సీట్ల పంపకాల చిక్కుముడి వీడితేనే బిహార్ ఎన్నికల చిత్రం స్పష్టమవుతుంది.