రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన “ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన” పథకం దేశవ్యాప్తంగా రైతాంగానికి వరంగా మారనుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణ అన్నారు.
సోమవారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, సులభ రుణాలు, నీటిపారుదల సౌకర్యాలు అందించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అందులో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు జిల్లాలకు అవకాశం లభించిందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఈ పథకంలో భాగమయ్యాయని వివరించారు.
మొదటి విడతలో 960 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఈ నిధులతో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రుణ సౌకర్యాల పెంపు, నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు ధాన్య ఉత్పత్తితో పాటు పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ పథకం ఆరు సంవత్సరాలపాటు కొనసాగుతుందని, దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని డికె. అరుణమ్మ తెలిపారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుండి 4వ స్థానానికి ఎదగడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకానికి రూపకల్పన చేశారని, రైతుల ఆదాయం పెంపు దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. “2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడం ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం.
ఆయన నాయకత్వంలో దేశంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతోంది. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేయడం మోడీ ప్రభుత్వ ప్రత్యేకత,” అని అరుణమ్మ అన్నారు. ప్రస్తుతం మన దేశం కొన్ని ధాన్యాలు, నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఈ పథకం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచి భవిష్యత్తులో ఎగుమతుల దిశగా సాగేందుకు మార్గం సుగమం అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేపీ జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్దా రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండల వెంకట రాములు, అక్కల రమాదేవి, గద్వాల బీజేపీ అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.