ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్ అలియాస్ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ సింగ్ జర్నలిస్టు కావడంతో పాటు, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింగ్ మేనల్లుడు.
గురువారం సాయంత్రం హర్ష్ హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్వరూప్ రాణీ నెహ్రూ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.
సంఘటన స్థలంలోని ఆధారాలు, కంటిచూసిన సాక్షుల వాంగ్మూలాల ప్రకారం విశాల్ అనే వ్యక్తి కొంత మందితో కలిసి ఈ దాడి జరిపినట్టు తేలిందని అదనపు పోలీసు కమిషనర్ అజయ్‌పాల్ శర్మ తెలిపారు. ఖుల్దాబాద్‌లోని మచ్లీ బజార్ ప్రాంతంలో విశాల్ కొనుగోలు చేసిన కత్తితోనే సింగ్‌పై దాడి చేసినట్టు విచారణలో బయటపడిందన్నారు. గురువారం రాత్రి ఘటనాస్థల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు విశాల్ కాళ్లలో మూడు బుల్లెట్లు తగిలి గాయపడ్డాడు.
అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని శర్మ తెలిపారు. ఇంకా ఒక నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుందని, మరో ఇద్దరు అనుమానితులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడు, మృతుడి మధ్య కొన్ని రోజుల క్రితం వివాదం జరిగినట్టు తేలిందని, దాని ఖచ్చితమైన కారణం కోసం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
