క్రీడలు హోమ్

పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదు….

#Afghanistan

ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదిలేదని ఆఫ్ఘానిస్తాన్‌ ప్రకటించింది. రానున్న మూడు దేశాల టి20 సిరీస్‌ (పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌)‌లో పాల్గొనబోమని ప్రకటించింది. పాకిస్తాన్‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్‌ క్రికెటర్లు మృతిచెందిన ఘటనపై ఆఫ్ఘానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB)  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్‌ జిల్లాలో జరిగిన ఈ దాడిని క్రూరమైన చర్యగా ఆఫ్ఘానిస్తాన్‌ పేర్కొన్నది. ఏసీబీ తన ఎక్స్‌ (పూర్వపు ట్విట్టర్‌) ఖాతాలో విడుదల చేసిన ప్రకటనలో, “పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్‌ జిల్లాకు చెందిన ధైర్యవంతులైన క్రికెటర్లు కబీర్‌, సిబ్గతుల్లా, హారూన్‌ పాకిస్తాన్‌ వైమానిక దాడిలో మరణించారు.

ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు” అని పేర్కొంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ముందుగా పాక్టికా రాజధాని షరానా కు వెళ్లి స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామమైన ఉర్గున్‌కి తిరిగి వచ్చి స్థానిక సమావేశంలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగింది.

ఏసీబీ తెలిపిన ప్రకారం, “ఈ ఘటన ఆఫ్ఘానిస్తాన్‌ క్రీడా సమాజానికి, ఆటగాళ్లకు, క్రికెట్‌ కుటుంబానికి తీవ్రమైన నష్టం. మృతుల కుటుంబాలకు, పాక్టికా ప్రజలకు మనఃపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము” అని పేర్కొంది. ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా, “మృతుల పట్ల గౌరవ సూచకంగా రానున్న నవంబర్‌ చివర్లో జరగబోయే త్రైదేశ టి20 సిరీస్‌లో పాల్గొనబోమని నిర్ణయించుకున్నాము” అని ఏసీబీ స్పష్టం చేసింది.

“అల్లాహ్‌ మరణించినవారికి జన్నతులో ఉన్నత స్థానం ప్రసాదించుగాక, గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము” అని తెలిపింది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ సైన్యం శుక్రవారం ఆఫ్ఘానిస్తాన్‌ తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు జరిపింది.

ఈ దాడులతో ఇటీవలే కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించబడిందని టోలో న్యూస్‌ పేర్కొంది. ఉర్గున్‌, బర్మాల్‌ జిల్లాల్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో పలు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌–ఆఫ్ఘాన్‌ సరిహద్దులో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల మధ్య ఈ దాడులు చోటు చేసుకున్నాయి.

కాల్పుల విరమణను దోహాలో జరుగుతున్న శాంతి చర్చలు పూర్తయ్యే వరకు పొడగించాలంటూ పాకిస్తాన్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ దాడులు జరగడం విశేషంగా మారింది.

Related posts

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!