ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కెనడాలో నిర్వహిస్తున్న క్యాప్స్ కేఫ్ (Kap’s Café) మరోసారి దుండగుల లక్ష్యంగా మారింది. జూలైలో ప్రారంభమైన ఈ కేఫ్‌పై ఇది. దీనిపై మూడోసారి కాల్పుల దాడి జరిగింది.
తాజా ఘటన గురువారం తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో సరీ (Surrey) నగరంలోని న్యూటన్ ప్రాంతంలో ఉన్న 85 అవెన్యూ, 120 స్ట్రీట్ వద్ద జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో కుల్వీర్ సిధు (Kulvir Sidhu) అనే వ్యక్తి, తాను ఈ దాడికి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించాడు.
అతను ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పుకుంటూ, మరో వ్యక్తి గోల్డీ ఢిల్లాన్ (Goldy Dhillon) కూడా ఈ కుట్రలో భాగమని పేర్కొన్నాడు. సిధు వీడియోలో మాట్లాడుతూ ‘‘వాహెగురు జీ కా ఖాల్సా, వాహెగురు జీ కి ఫతేహ్ ఈ రోజు క్యాప్స్ కేఫ్‌లో జరిగిన కాల్పులు నేను, గోల్డీ ఢిల్లాన్ చేశాం. మాకు డబ్బులు ఇవ్వాల్సినవారు లేదా మోసం చేసే వారు జాగ్రత్త. మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడే బాలీవుడ్ వ్యక్తులు కూడా సిద్ధంగా ఉండాలి బుల్లెట్లు ఎక్కడి నుంచైనా వస్తాయి,” అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు దాడి కేవలం వ్యాపారపరమైన కాకుండా భయపెట్టే ప్రయత్నం, లేదా మతపరమైన బెదిరింపు భాగమై ఉండవచ్చని సూచిస్తున్నాయి. సరీ పోలీస్ సర్వీస్ (SPS) అధికారులు వీడియో ప్రామాణికతను నిర్ధారించకపోయినా, ఈ దాడుల ధోరణి ఎక్స్టోర్షన్ (దోపిడీ, డబ్బు వసూళ్ల) లక్షణాలు కలిగి ఉందని వెల్లడించారు.
SPS ప్రతినిధి ఇయాన్ మాక్‌డొనాల్డ్ మాట్లాడుతూ, “ఈ ఘటనల్లో దోపిడీ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రావిన్షియల్ ఎక్స్టోర్షన్ టాస్క్‌ఫోర్స్ ఈ కేసును స్థానిక అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తోంది,” అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ మూడు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు కానీ తాజా దాడిలో ఆస్తి నష్టం గణనీయంగా జరిగింది.
ఆ సమయంలో కేఫ్‌లో సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ ఎక్స్టోర్షన్ నెట్‌వర్క్‌లో భాగం కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ భారతదేశంలోని పలువురు సినీ తారలు, వ్యాపారవేత్తలను కూడా డబ్బు కోసం లేదా మతపరమైన కారణాలతో బెదిరించినట్లు సమాచారం.
కపిల్ శర్మ కేఫ్‌పై గత దాడులు:
జూలై 10: కేఫ్ ప్రారంభమైన నాలుగు రోజులకే కాల్పులు జరిగాయి.
ఆగస్టు 7: మరోసారి దుండగులు కాల్పులు జరిపి కిటికీలు, గోడలను దెబ్బతీశారు.
అక్టోబర్ 16: సిబ్బంది లోపల ఉన్న సమయంలో బుల్లెట్లు దూసుకువచ్చాయి.
ఈ వరుస దాడులపై కపిల్ శర్మ లేదా ఆయన బృందం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సరీ నగరంలో గ్యాంగ్‌స్టర్ దాడులు, దోపిడీ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటివరకు 65 ఎక్స్టోర్షన్ కేసులు, 35 కాల్పుల ఘటనలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.