అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లా ఎస్పీ సూచనలు:
రహదారులపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నడపరాదు, నడకలోనూ జాగ్రత్తలు పాటించాలి.
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు పడిపోయే అవకాశమున్నందున వాటి సమీపంలో నిల్చోకూడదు.
పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాల కారణంగా ఇళ్లలో తేమ, లీకేజీ సమస్యలు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు దాటడానికి ప్రయత్నించరాదు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లి, సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలి.
చిన్నపిల్లలు కుంటలు, చెరువుల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం, చేపలు పట్టడం చేయరాదు.
పిడుగులు పడే సమయాల్లో చెట్లు, ఎత్తైన టవర్స్, విద్యుత్ స్తంభాల కింద నిల్చోరాదు.
జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ప్రమాదకర పరిస్థితులు గమనించినా లేదా అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే 100 / 112 పోలీసు ఎమర్జెన్సీ నంబర్ కు లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.