వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కోర్టులన్నా, చట్టాలన్నా లెక్కేలేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఐతే ఆయన తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ ఇటీవల ఐరోపా వెళ్లబోయే ముందు సీబీఐకి తన నంబరు కాకుండా మరొకరిది ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ మధ్య…15 రోజులపాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నాననీ, అందుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఐతే విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నంబరు తనది కాదని సీబీఐ పరిశీలనలో తేలింది. బెయిలు షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. వేరే నంబరు సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు.
ఈ అంశంపై కోర్టు జగన్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుల్ని అసలు లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు. కేసుల్లో విచారణకు హాజరు కారు.. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోరు. అసలు ఆయన యూరప్ కు ఏ కారణంతో వెళ్లారో.. అక్కడే పనులు చక్కబెడుతున్నారో అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. దర్యాప్తు సంస్థకు అందకుండా ..తన సమాచారం తెలియకుండా ఆయన జాగ్రత్తపడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.