కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సహ విద్యార్థిచే అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని నగర దక్షిణ భాగంలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో చదువుకోడానికి వచ్చిన ఆ యువతి, ఆనందపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ తాను సహ విద్యార్థితో కలిసి పానీయాలు సేవించినప్పుడు, అతడు అందులో మత్తు మందు కలిపాడని, దాంతో తాను స్పృహ తప్పి, అనంతరం అత్యాచారానికి గురయ్యానని పేర్కొంది.
పోలీసులు ఆ యువతి స్వస్థలాన్ని వెల్లడించలేదు. “విద్యార్థిని ఆనందపూర్‌లోని అద్దె గదిలో ఉంటోంది. నిందితుడు అక్కడకు వచ్చి పానీయాల్లో మత్తు మందు కలిపాడు. ఆ పానీయం తాగిన తర్వాత ఆమె స్పృహ తప్పింది. అనంతరం నిందితుడు అత్యాచారం చేశాడు,” అని ఒక సీనియర్ అధికారి వివరించారు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని గ్యాంగ్‌రేప్ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం, ఘటన తర్వాత నిందితుడు కొద్ది రోజులు పరారీలో ఉన్నాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన సమయంలోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిని నగర న్యాయస్థానంలో హాజరుపరచగా, అక్టోబర్ 22 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు. “మేము దర్యాప్తు ప్రారంభించాము. జరిగిన అంశాలపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాము,” అని పోలీసు అధికారి తెలిపారు.