భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ భూభాగం ఇక ఏ మాత్రం క్షేమకరం కాదు… నిజం… ఇదే హెచ్చరికను భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జారీ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ శనివారం మాట్లాడుతూ, “పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలో ఉంది. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ట్రైలర్ మాత్రమే” అని హెచ్చరించారు.
లక్నోలోని సరోజిని నగర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ వద్ద తయారైన తొలి క్షిపణి బ్యాచ్‌ను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, “బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ భారత సాయుధ దళాలకు బలమైన ఆధారంగా మారింది.
దేశం కలలను నిజం చేసుకునే సామర్థ్యం మనకు ఉందనే నమ్మకాన్ని ఇది మరింత బలపరిచింది” అని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ తమ కొత్త ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఫెసిలిటీ నుండి తొలి బ్యాచ్ క్షిపణులను విజయవంతంగా తయారు చేసింది.
ఈ యూనిట్ ప్రారంభోత్సవం ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (UPDIC)కు ఒక ముఖ్యమైన మైలురాయి అవడమే కాకుండా, రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అత్యాధునిక యూనిట్‌లో క్షిపణి సమీకరణ, పరీక్షలు, నాణ్యత నియంత్రణ కోసం అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయని వెల్లడించారు. విజయవంతమైన పరీక్షల అనంతరం క్షిపణులను భారత సాయుధ దళాలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్, మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది, పలువురు అధికారులూ పాల్గొన్నారు.