రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్‌రావు చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన చెప్పిన విషయాల ప్రకారం వైసీపీ నాయకులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ ద్వారా భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడి అవుతున్నది.
నకిలీ మద్యం కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావు చేసిన వెల్లడి రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం రేపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని ఆయన పోలీసులకు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
జనార్ధన్‌రావు మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా సంస్థలు, పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించడంతో తయారీని నిలిపివేశాం,” అని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని కోరారని జనార్ధన్‌రావు పేర్కొన్నాడు. “కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు సహకరించమని జోగి రమేష్ నన్ను ఒత్తిడి చేశారు. మొదట ఇబ్రహీంపట్నంలో యూనిట్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం.
కానీ ఆయన ఆదేశాల మేరకు తంబళ్లపల్లెలో తయారీ ప్రారంభించాం” అని వివరించాడు. తంబళ్లపల్లెలో తయారీ చేస్తే చంద్రబాబు నాయుడిపై నేరుగా ఆరోపణలు చేయవచ్చని జోగి రమేష్ చెప్పినట్లు జనార్ధన్‌రావు వెల్లడించాడు. ఈ ప్రకటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఈ ఆరోపణలపై జోగి రమేష్ స్పందిస్తూ తనకు ఈ అంశంతో సంబంధం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నాడు. అయితే పోలీసులు ఈ అంశంపై మరింత దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, రాజకీయ సంబంధాలపై దర్యాప్తు బృందం సవివరంగా విచారణ జరుపుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కేసు ఇప్పటికే రాజకీయ వాదనలకు దారితీస్తుండగా, జనార్ధన్‌రావు వెల్లడించిన ఈ అంశాలు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.