సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి విపరీతమైన స్పందన లభించడంతో ఈ కార్యక్రమాన్ని రెండో రోజుకూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే 30 వేల మందికి పైగా నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోవడంతో, రద్దీని క్రమబద్ధీకరించి ప్రతి నిరుద్యోగ యువకుడు, యువతికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
శుక్రవారం ఉదయం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూర్యాపేట జిల్లా అధికారులతో పాటు కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జాబ్ మేళాకు ఊహించని స్థాయిలో నిరుద్యోగులు తరలి వస్తుండడంతో ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
మేళాలో పాల్గొంటున్న 255కి పైగా పరిశ్రమల వివరాలను కేటగిరీ వారీగా విభజించి, స్పష్టమైన సమాచారం ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అల్పాహారం, భోజన వసతులు, విశ్రాంతి సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలని మంత్రి ఆదేశించారు.
హుజుర్‌నగర్ వైపు భారీగా నిరుద్యోగులు తరలి వస్తుండటంతో, రవాణా సౌకర్యాల కోసం ఆర్టీసీకి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ప్రతి బస్సు మేఘా జాబ్ మేళా సమీపంలో ఆగేలా ఏర్పాట్లు చేయాలని, ఎవరికి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు క్రమబద్ధీకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. రెండో రోజు కొనసాగింపుకు సంబంధించిన సమన్వయంపై నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా వివరాలను తక్షణమే నిరుద్యోగులకు చేరేలా, గ్రామ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
రెండో రోజు కూడా మరింత పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనే అవకాశం ఉన్నందున, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రతి అభ్యర్థి ఇంటర్వ్యూ, నియామక ప్రక్రియలో సులభంగా పాల్గొనేలా పూర్తి ఏర్పాట్లు ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
