త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అభ్యర్ధిని నిలబెట్టబోతున్నారా? ఈ ఊహాగానాలు పూర్తి స్థాయిలో చెక్కర్లు కొడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్నది. దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిజెఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన అభ్యర్ధిగా రంగంలో దించబోతున్నారని నేటి ఉదయం నించి పుకార్లు ఊపందుకున్నాయి.
విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలవడంతో ఈ పుకారు వ్యాపించింది. కానీ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయంలో దసరా నవరాత్రి పూజకు తాను కవితకు ఆహ్వానం అందజేశానని ఆయన స్పష్టతనిచ్చారు. దాంతో ఆ వార్త గంటలోనే పటాపంచలైపోయింది. తరువాత, తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, విష్ణువర్ధన్ రెడ్డి స్వయంగా ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు. తాను బిఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉన్నానని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కె.టి.ఆర్) కు తన మద్దతును కొనసాగిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.