తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో కుప్పకూలే దిశగా పయనిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలం కావడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో వరుసగా మూడు నెలల్లో రుణాత్మక ద్రవ్యోల్బణం (Negative Inflation/Deflation) నమోదవడం పాలన వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తోందన్నారు.
వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని ఆయన అన్నారు.
- జూన్: -0.93%
- జూలై: -0.44%
- సెప్టెంబర్: -0.15%
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు.
సాధారణంగా బతుకమ్మ, దసరా వంటి పండుగల నేపథ్యంలో ప్రజల్లో వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, అందుకు విరుద్ధంగా నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల ఫెయిల్యూర్‌ను స్పష్టం చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి ‘దుర్మార్గ పాలన’, ‘ఆర్థిక అరాచకత్వం’ వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని, మీ పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలి,” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.