రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పాత గాజువాక సర్కిల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులతో కలిసి మంత్రి ఎక్సైజ్ సురక్షా పోస్టర్ ఆవిష్కరించారు. గాజువాకలో పల్లా శ్రీనివాస్ తో ఎక్సైజ్ సురక్ష యాప్ పోస్టర్ ఆవిష్కరించి, మద్యం షాపులో బాటిల్స్ ను మంత్రి కొల్లు రవీంద్ర స్కాన్ చేశారు.
మద్యం కల్తీపై వైసీపీ నాయకులు ఉద్దేశ్యపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు జరిగే అవకాశం కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తమ ప్రభుత్వం 2014-19లోనే ట్రాక్ అండ్ ట్రేస్ తీసుకొచ్చామని చెప్పారు. జగన్ రెడ్డి వచ్చాక వ్యవస్థలు నాశనం చేసి కల్తీ మద్యం అమ్మాడని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసినా, బెల్టు షాపులు నడిపినా తోలు తీస్తామని హెచ్చరించారు.
