అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రెస్ క్లబ్ కమిటీకి, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని జర్నలిస్టులు అంతా కలిసి ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి ఏర్పాటు చేసుకోవడంతో పాటు నేడు వెబ్ సైట్‌ను రూపొందించుకోవడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి ఆలోచనల స్ఫూర్తితోనే 2018లో ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ పురుడుపోసుకుందని కమిటీ సభ్యులు చెప్పారు. నాటి నుంచి ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి తరుపున పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు అమరావతిలో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టి…రాజధానిలో అమరావతి ప్రెస్ క్లబ్‌ను ఒక మంచి కేంద్రంగా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని…ఈ క్రమంలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రెస్ క్లబ్ లను కూడా పరిశీలించి డిజైన్లు రూపొందించామని కమిటీ సభ్యులు తెలిపారు.
అమరావతి ప్రెస్ క్లబ్ ద్వారా రాజధానిలో మీడియా తనవంతు పాత్ర పోషించాలనేది తమ ఆకాంక్షగా వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కోరగా…ఆయన సానుకూలంగా స్పందించారు. రాజధానిలో మీడియా అవసరాలు తీర్చడానికి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పాజీ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ట్రెజరర్ కె.పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ మహేష్, కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, కె.గాంధీబాబు, అనిల్ పాల్గొన్నారు.