సుస్థిర ఆర్ధిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జీఎస్డీపీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-26 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1 శాతం వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నాం, ఏమేరకు ఫలితాలు సాధించాం అనేది విశ్లేషించుకోవాలన్నారు.
అన్ని రంగాల వృద్ధికి ప్రత్యేక అధ్యయనం :
సుదీర్ఘ సముద్రతీరం, పుష్కలంగా జలవనరులు, మెరుగైన మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలన్నారు. పర్యాటక రంగంలో ప్రస్తుతం సాధించిన 17.08 శాతం పురోగతి సరిపోదని… ఈ రంగంలో 25 శాతం వృద్ధికి అవకాశం ఉందన్నారు. వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు. రైల్వేస్, ట్రాన్స్‌పోర్ట్, హోటళ్లు, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. శాఖలు, రంగాలు, నియోజకవర్గాల వారీగా జీఎస్డీపీ వివరాలను మరింత లోతుగా నమోదు చేయాలని అన్నారు.
పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి:
జాతీయ సగటును మించి 2025-26 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్డీపీలో వృద్ధి నమోదైందని రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని విలువ రూ.3,57,894 కోట్లుగా వెల్లడించారు. గత ఏడాది ఇదే కాలంలో రాష్ట్రంలో 9.58 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది 10.50 శాతం సాధ్యమైందన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.8 శాతం ఉంటే, దాని కంటే అధికంగా గణనీయమైన ప్రగతిని కనబరచడం రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైందనే విషయాన్ని రుజువు చేస్తోందన్నారు. ఏపీ జీఎస్డీపీ వృద్ధిని రంగాలవారీగా పరిశీలిస్తే పరిశ్రమల శాఖలో 11.91 శాతం, సేవల రంగంలో 10.70 శాతం, వ్యవసాయ రంగంలో 9.60 శాతం, జీవీఏ 10.76 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు :
తొలి త్రైమాసికంలో ప్రస్తుత ధరల్లో పశుపోషణ ఉత్పత్తి విలువ రూ.46,751 కోట్లు (6.65% వృద్ధి), చేపల పెంపకం-ఆక్వాకల్చర్ రూ.32,110 కోట్లు (14.52% వృద్ధి), మాంసం ఉత్పత్తి 3.15 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.41 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది (8% వృద్ధి), గుడ్ల ఉత్పత్తి 62,157 లక్షల నుంచి 67,450 లక్షలకు పెరిగింది.
పరిశ్రమల రంగం :
మైనింగ్-క్వారీయింగ్‌లో రూ.10,686 కోట్లు (43.54% వృద్ధి), తయారీ రంగం రూ.40,515 కోట్లు (9.93% వృద్ధి), నిర్మాణ రంగం రూ.31,550 కోట్లు (9.57% వృద్ధి), రోడ్ మెటల్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ ఉత్పత్తి పెరిగింది.
సేవా రంగం :
హోటళ్లు, రవాణా – పర్యాటక రంగం రూ.25,702 కోట్లు (17.92% వృద్ధి), రియల్ ఎస్టేట్ – ప్రొఫెషనల్ సర్వీసులు రూ.34,324 కోట్లు (11.70% వృద్ధి), పర్యాటకులు 6.89 కోట్ల నుంచి 8.07 కోట్లకు పెరిగారు (17.08% వృద్ధి), విమాన ప్రయాణికులు 13.09 లక్షల నుంచి 15.85 లక్షలకు పెరిగారు (21.1% వృద్ధి).