దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శోభా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పీఎన్‌సీ మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎన్‌సీ మీనన్ అమరావతిలో ఆధునిక గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న శోభా గ్రూప్ చైర్మన్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం మాట్లాడుతూ, అమరావతిలో వచ్చే మూడేళ్లలో అన్ని మౌలిక వసతులు పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని, పెట్టుబడుల వాతావరణం రాష్ట్రంలో మరింత బలపడుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీఎన్‌సీ మీనన్ ఉమ్మడి రాష్ట్ర కాలంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసి ఆయన దూరదృష్టిని ప్రశంసించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనాలని పీఎన్‌సీ మీనన్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు.