విశాఖపట్నం హోమ్

జగన్ టూర్ పై గంటా మాస్ వార్నింగ్

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా 63 కిలో మీటర్ల పొడవున రోడ్డు మార్గాన టూర్ చేస్తాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని.. మక్కెలు విరగ్గొట్టి లోపల కూర్చోపెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతులు కాదని, వ్యవస్థలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

దర్శి, సత్తెనపల్లి, నెల్లూరు, అనంతపురంలలో జగన్ పర్యటనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. భద్రతా కారణాలరీత్యా నర్సీపట్నం పర్యటనకు హెలికాప్టర్ లో వెళ్లాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తే దాన్ని రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అనంతరపురం జిల్లా రాఫ్తాడు పర్యటనకు హెలికాప్టర్ లోనే వెళ్లిన జగన్ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు.

తమిళ్ హీరో విజయ్ పర్యటనలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 40 మంది మృతి చెందారని.. మరోపక్క అంతర్జాతీయ మహిళ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గురువారం ఉదయం విశాఖ వచ్చి సాయంత్రం 4.30 గంటలకు బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయే వీకెండ్ పొలిటీషియన్ గా జగన్ ను అభివర్ణించారు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటికి తాళాలు వేసినట్టు.. చంద్రబాబు పరామర్శకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నట్టు.. తామూ చేయగలమని, అయితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీ కావడం వల్ల ఎవరి హక్కులు హరించే ఉద్దేశం తమకు లేదన్నారు.

కోటి సంతకాలు దేని కోసమో చెప్పాలి!

అధికారంలో ఉన్న అయిదేళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయని జగన్మోహన్ రెడ్డి.. వాటిని పూర్తి చేయాలని ఇప్పుడు కోటి సంతకాలు సేకరించడం హాస్యాస్పదంగా ఉందని గంటా అన్నారు. 26 జిల్లాల్లో కోట్లాది రూపాయలతో వైసీపీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్న జగన్ తాను పూర్తి చేయలేని నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

మెడికల్ కాలేజీల విషయంలో ఏమాత్రం నిబద్ధత ఉన్నా.. రూ. 450 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టకుండా నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయంలో నాణ్యమైన మద్యం అందించామని జగన్ చెప్పడం జోక్ ఆఫ్ ద ఇయర్ గా ఎద్దేవా చేశారు. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ రాకూడదనే ఉద్దేశంతో చనిపోయిన రైతు పేరుతో కోర్టులో కేసు వేసి.. వైసీపీ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారని చెప్పారు. అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని స్టీల్ ప్లాంట్ కు వెళ్తారన్నారు. అభివృద్ధి, విజన్ లకు చంద్రబాబు.. అరాచకానికి, అవినీతికి జగన్మోహన్ రెడ్డి.. బ్రాండ్ అంబాసిడర్లుగా పేర్కొన్నారు.

విశాఖ అభివృద్ధి అడ్డుకునేలా వైసీపీ తీర్మానం

విశాఖ అభివృద్ధిని ఆపడానికి ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఇటీవల పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్ హాల్లో రహస్యంగా సమావేశం కావడం సిగ్గు చేటన్నారు. గూగుల్, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, అర్సెల్లాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమల భూ సేకరణ అడ్డుకోవాలని ఆ సమావేశంలో తీర్మానించారని ఆరోపించారు. వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను అడ్డుకుని ఏం సాధిస్తారని, ఉత్తరాంధ్రపై చూపించే ప్రేమ ఇదేనా అని నిలదీశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, చిక్కాల విజయ్ బాబు, గాడు అప్పలనాయుడు, జనసేన నాయకుడు శాఖారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

Leave a Comment

error: Content is protected !!