జాతీయం హోమ్

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

#Coldrif

ప్రాణాంతక కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ దారుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ గోవిందన్ ను పోలీసులు అరెస్టు చేయడంతో దగ్గు మందు కేసు కీలక మలుపు తిరిగినట్లయింది.

కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా మధ్యప్రదేశ్ కనీసం 20 మంది పిల్లలు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచే గోవిందన్ కదలికలను గమనిస్తూ, పోలీసులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా రూపొందించిన ఆపరేషన్‌లో ఈ అరెస్ట్ జరిగింది. రాత్రి 1:30 సమయంలో ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుని, తరువాత కాంచీపురం ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎక్కువ మంది పిల్లలు మృతి చెందిన ఛింద్వారాకు తరలించేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. పిల్లల జలుబు చికిత్స కోసం ఉపయోగించే కోల్డ్రిఫ్ సిరప్‌లో డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) అనే అత్యంత విషపదార్థం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.

సాధారణంగా ప్రింటింగ్ ఇంక్ పదార్థాల్లో ఉపయోగించే ఈ రసాయనాన్ని కంపెనీ 46–48% వరకు ఉపయోగించినట్టు తమిళనాడు అధికారులు తెలిపారు. ఇది అనుమతించబడిన 0.1% పరిమితిని విపరీతంగా మించిపోయింది. DEG తాగితే కిడ్నీ వైఫల్యం, లివర్ దెబ్బతినడం, నాడీ వ్యవస్థ సమస్యలు వంటి ప్రమాదాలు కలుగుతాయి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిల్లలు ఈ సిరప్ వాడిన తర్వాత కిడ్నీ సమస్యలతో మృతి చెందినట్లు సమాచారం. కాంచీపురంలోని స్రేసన్ ఫార్మా ఫ్యాక్టరీలో నిర్వహించిన తనిఖీల్లో లెక్కలో లేని DEG కంటైనర్లు, పలు నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

అలాగే కంపెనీకి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (GMP) సర్టిఫికేట్ కూడా లేనట్లు అధికారులు తెలిపారు. దీనితో తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆ దగ్గు మందు ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించి సిరప్ నిల్వలను ఫ్రీజ్ చేసి, లైసెన్సును సస్పెండ్ చేసింది. కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) కూడా పలు ఔషధ తయారీ సంస్థల్లో నాణ్యత నియంత్రణ లోపాలు ఉన్నాయని అంగీకరించింది.

అనేక కంపెనీలు ప్రతి బ్యాచ్ రా మెటీరియల్, యాక్టివ్ పదార్థాలపై పరీక్షలు చేయడం లేదు అని తెలిపింది. ఈ ఘటన తరువాత తొమ్మిది రాష్ట్రాలు కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం విధించాయి. గోవిందన్ అరెస్టుకు ముందు రోజు ఆయనపై ₹ 20,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు. గోవిందన్‌పై మందుల కల్తీ, నిర్లక్ష్యంగా ప్రాణహానికర చర్యలు, పిల్లల భద్రతను ప్రమాదంలో పెట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి.

Related posts

వైకాపాకు షాక్ – సర్దుకొంటున్న సీనియర్లు!

Satyam News

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!