బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్, సబ్ కమిటీ ఏర్పాటు చేసి, కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం శాసన సభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపిందని వివరించారు.
2018లో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని మంత్రి అన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని ప్రభుత్వం ఊహించలేదని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్‌గా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇక బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ కేసులో హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. “మా నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం ఆధారంగా రాబోయే ఎన్నికలకు వెళ్తాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.